ثَلَاثَةُ الأُصُولِ وَأَدِلَّتُهَا
త్రిసూత్రాలు మరియు వాటి ఆధారాలు
لِلشَّيْخِ
مُحَمَّدٍ التَّمِيمِي رَحِمَهُ اللهُ
షేక్ ముహమ్మద్ అత్తమీమీ రహిమహుల్లాహ్
بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ
అనంత కరుణాప్రదాత, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో
తెలుసుకోండి! అల్లాహ్ మీపై కరుణించుగాక! నాలుగు విషయాల గురించి తెలుసుకోవటం మనపై విధి అవుతుంది.
మొదటి విషయం: జ్ఞానము. అది అల్లాహ్ అవగాహన, ఆయన ప్రవక్త అవగాహన మరియు ఇస్లాం ధర్మం అవగాహన ఆధారాలతో చేసుకొనుట.
రెండవ విషయం: దాని పై ఆచరణ.
మూడవ విషయం: దాని వైపు ఆహ్వానించుట.
నాల్గవ విషయం: అందులో (ధర్మప్రచారంలో) కలిగే బాధలపై సహనం చూపుట.
మరియు అల్లాహ్ వాక్కు ఆధారం: బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అనంత కరుణాప్రదాత, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో)
﴿وَٱلۡعَصۡرِ1 إِنَّ ٱلۡإِنسَٰنَ لَفِي خُسۡرٍ2 إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَتَوَاصَوۡاْ بِٱلۡحَقِّ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ3﴾
కాలం సాక్షిగా! నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు! కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థయిర్యాన్ని) బోధించుకునే వారు తప్ప! [అస్ర్ 103: 1-3]
ఇమామ్ షాఫయీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు: ఒకవేళ అల్లాహ్ తన సృష్టిపై దీనిని (ఈ సూరాను) తప్ప మరే సాక్ష్యాన్నీ అవతరింపజేయకపోయినా, అది వారికి సరిపోయేది.
ఇమామ్ బుఖారీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు: అధ్యాయం: మాట మరియు ఆచరణ కన్నా ముందు జ్ఞానముండాలి. మరియు అల్లాహ్ పేర్కొన్న ఈ వచనమే దీనికి ఆధారం: “(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడని తెలుసుకో, మరియు నీ పాపం కోసం క్షమాపణ వేడుకో...” [ముహమ్మద్ 47:9]. కాబట్టి అల్లాహ్ మాట మరియు ఆచరణకు ముందే ఆయన జ్ఞానంతో ప్రారంభించాడు.
(తెలుసుకోండి) అల్లాహ్ మీపై కరుణించుగాక. ప్రతి ముస్లిం స్త్రీ పురుషుని పై ఈ మూడు అంశాలను నేర్చుకోవడం మరియు వాటిని ఆచరించడం తప్పనిసరి (విధి).
మొదటి విషయం: అల్లాహ్ యే మనల్ని సృష్టించాడు, మనకు జీవనోపాధిని ప్రసాదించాడు, మరియు మనల్ని వదిలివేయలేదు; బదులుగా, ఆయన మన వైపుకు ఒక ప్రవక్తను పంపాడు. కావున ఆయన పట్ల విధేయత చూపినవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. మరియు ఆయన పట్ల అవిధేయత చూపినవాడు నరకంలో ప్రవేశిస్తాడు. మరియు అల్లాహ్ యొక్క వాక్కు నుండి దీనికి ఆధారం:
﴿إِنَّآ أَرۡسَلۡنَآ إِلَيۡكُمۡ رَسُولٗا شَٰهِدًا عَلَيۡكُمۡ كَمَآ أَرۡسَلۡنَآ إِلَىٰ فِرۡعَوۡنَ رَسُولٗا15 فَعَصَىٰ فِرۡعَوۡنُ ٱلرَّسُولَ فَأَخَذۡنَٰهُ أَخۡذٗا وَبِيلٗا16﴾
మేము ఫిరఔన్ వద్దకు సందేశహరుణ్ణి పంపినట్లు, నిశ్చయంగా మీ వద్దకు కూడా ఒక సందేశహరుణ్ణి, మీకు సాక్షిగా ఉండటానికి పంపాము. కాని ఫిర్ఔన్ ఆ సందేశహరునికి అవిధేయత చూపాడు. కావున మేము అతనిని తీవ్రమైన శిక్షకు గురి చేశాము. [ముజ్జమ్మిల్ 73:15-16]
రెండవ విషయం: అల్లాహ్ తన ఆరాధనలో తనతో పాటు మరెవరినీ సాటి కల్పించడాన్ని అస్సలు ఇష్టపడడు. దగ్గరి దైవదూత అయినా, పంపించబడ్డ ప్రవక్త అయినా సరే. అల్లాహ్ యొక్క ఈ వాక్యము దీనికి ఆధారం:
﴿وَأَنَّ ٱلۡمَسَٰجِدَ لِلَّهِ فَلَا تَدۡعُواْ مَعَ ٱللَّهِ أَحَدٗا18﴾
మరియు నిశ్చయంగా, మస్జిదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కావున వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి. [అల్ జిన్న్ 72:18]
మూడవ విషయం: ఎవరైతే ప్రవక్తకు విధేయత చూపి, అల్లాహ్ ఏకత్వాన్ని చాటి చెబుతారో, వారికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల శతృత్వం వహించే వారితో సత్సంబంధాలు పెట్టుకొనుట ఏ మాత్రం సమ్మతం కాదు, ఒకవేళ వారు అత్యంత సమీప బంధువులైనప్పటికీ.
మరియు అల్లాహ్ యొక్క వాక్కు దీనికి ఆధారం :
﴿لَّا تَجِدُ قَوۡمٗا يُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ يُوَآدُّونَ مَنۡ حَآدَّ ٱللَّهَ وَرَسُولَهُۥ وَلَوۡ كَانُوٓاْ ءَابَآءَهُمۡ أَوۡ أَبۡنَآءَهُمۡ أَوۡ إِخۡوَٰنَهُمۡ أَوۡ عَشِيرَتَهُمۡۚ أُوْلَٰٓئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ ٱلۡإِيمَٰنَ وَأَيَّدَهُم بِرُوحٖ مِّنۡهُۖ وَيُدۡخِلُهُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ رَضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُۚ أُوْلَٰٓئِكَ حِزۡبُ ٱللَّهِۚ أَلَآ إِنَّ حِزۡبَ ٱللَّهِ هُمُ ٱلۡمُفۡلِحُونَ22﴾
అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించేవారు అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల శత్రుత్వం వహించేవారిని ప్రేమిస్తున్నట్లు నీవు ఎక్కడా చూడవు – ఆఖరికి వారు తమ తండ్రులైనాసరే, తమ కొడుకులైనాసరే, తమ అన్నదమ్ములైనాసరే, తమ పరివారజనులైనా సరే (ససేమిరా వారిని ప్రేమించరు). అల్లాహ్ విశ్వాసాన్ని రాసి పెట్టినది ఇలాంటి వారి హృదయాలలోనే! ఆయన తన తరపున ఒక ఆత్మ ద్వారా వీరిని ప్రత్యేకంగా బలపరిచాడు. ఇంకా వీరికి, క్రింద సెలయేరులు పారే స్వర్గ వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. అందులో వీరు కలకాలం ఉంటారు. అల్లాహ్ వీరి పట్ల ప్రసన్నుడయ్యాడు. వీరు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. అల్లాహ్ పక్షానికి చెందిన వారంటే వీరే. నిశ్చయంగా సాఫల్యం పొందేవారు అల్లాహ్ పక్షం వారే. [అల్ ముజాదిల 58:22]
(తెలుసుకోండి) అల్లాహ్ మీకు తనకు విధేయత చూపే సన్మార్గం చూపుగాక. హనీఫియ్య ఇబ్రాహీం మిల్లత్ అంటే మీరు ఏకైకుడైన అల్లాహ్ కొరకే ధర్మాన్ని ప్రత్యేకిస్తూ ఆరాధించాలి. ఈ కార్యము గురించే అల్లాహ్ ప్రజలందరికి ఆదేశించాడు. మరియు వారిని దాని కొరకే సృష్టించాడు. అల్లాహ్ తఆలా ప్రకటన:
﴿وَمَا خَلَقۡتُ ٱلۡجِنَّ وَٱلۡإِنسَ إِلَّا لِيَعۡبُدُونِ56﴾
మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే! [అద్-దారియాత్ 51:56] యాబుదూని అనే పదానికి అర్ధం నా ఏకత్వాన్ని అంగీకరించి కేవలం నన్నే ఆరాధించటం.
అల్లాహ్ ఆదేశించిన వాటిలో ప్రధానమైన, ఉన్నతమైన ఆదేశం తౌహీద్. అది అల్లాహ్ ను ఆరాధనలో ఏకైకుడిగా చేయడం.
మరియు అల్లాహ్ వారించిన వాటిలో ప్రధానమైనది షిర్క్. మరియు అది అల్లాహేతరులను ఆయనతో పాటు పిలవటం.
మరియు దీనికి అల్లాహ్ యొక్క వాక్కు నుండి ఆధారం :
﴿وَٱعۡبُدُواْ ٱللَّهَ وَلَا تُشۡرِكُواْ بِهِۦ شَيۡـٔٗا...﴾
మరియు మీరు అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి...[అన్నిసా 4:36]
(మిమ్మల్ని ఇలా ప్రశ్నించినప్పుడు): మనిషి అవగాహన చేసుకోవటానికి ఆవశ్యకమైన త్రిసూత్రాలు ఏవి?
మీరు ఈ సమాధానమివ్వండి: దాసుడు తన ప్రభువు గురించి, తన ధర్మం గురించి మరియు తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అవగాహన పొందడం.
[మొదటి ప్రాథమిక సూత్రము]
(మిమ్మల్ని ఇలా ప్రశ్నించినప్పుడు): మీ ప్రభువు ఎవరు?
మీరు ఈ సమాధానమివ్వండి: నా ప్రభువు అల్లాహ్, ఆయనే తన అనుగ్రహాలతో నన్ను పోషిస్తున్నాడు మరియు సర్వలోకాలను పోషిస్తున్నాడు. ఆయనే నా ఆరాధ్య దైవం, నా కొరకు ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. అల్లాహ్ యొక్క ఈ వాక్యము దీనికి ఆధారం:
﴿ٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ2﴾
సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు. [అల్ ఫాతిహా 1:2]
మరియు అల్లాహ్ తప్ప మిగిలినదంతా ఆయన సృష్టి (ప్రపంచం), మరియు నేను ఆ సృష్టిలో ఒకడిని.
(మిమ్మల్ని ఇలా ప్రశ్నించినప్పుడు): మీరు మీ ప్రభువును ఎలా కనుగొన్నారు?
దానికి ఇలా జవాబు చెప్పండి - ఆయన సూచనలు మరియు ఆయన సృష్టి ద్వారా.
మరియు ఆయన సూచనలలో నుంచి: రాత్రి మరియు పగలు, సూర్యుడు మరియు చంద్రుడు.
మరియు ఆయన సృష్టిలో నుంచి: ఏడు ఆకాశములు మరియు వాటిలో ఉన్నవారు, ఏడు భూములు మరియు వాటిలో ఉన్నవారు, మరియు వాటి మధ్య ఉన్నవన్నీ.
మరియు దీనికి అల్లాహ్ యొక్క వాక్కు నుండి ఆధారం:
﴿وَمِنۡ ءَايَٰتِهِ ٱلَّيۡلُ وَٱلنَّهَارُ وَٱلشَّمۡسُ وَٱلۡقَمَرُۚ لَا تَسۡجُدُواْ لِلشَّمۡسِ وَلَا لِلۡقَمَرِ وَٱسۡجُدُواْۤ لِلَّهِۤ ٱلَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمۡ إِيَّاهُ تَعۡبُدُونَ37﴾
మరియు ఆయన సూచనలలో (ఆయతులలో) రేయింబవళ్ళు మరియు సూర్యచంద్రులున్నాయి. మీరు సూర్యునికి గానీ చంద్రునికి గానీ సాష్టాంగం (సజ్దా) చేయకండి, కాని కేవలం వాటిని సృష్టించిన అల్లాహ్ కు మాత్రమే సాష్టాంగం (సజ్దా) చేయండి - నిజంగానే మీరు ఆయనను ఆరాధించేవారే అయితే. [ఫుస్సిలత్ 41:37]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿إِنَّ رَبَّكُمُ ٱللَّهُ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ فِي سِتَّةِ أَيَّامٖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ يُغۡشِي ٱلَّيۡلَ ٱلنَّهَارَ يَطۡلُبُهُۥ حَثِيثٗا وَٱلشَّمۡسَ وَٱلۡقَمَرَ وَٱلنُّجُومَ مُسَخَّرَٰتِۭ بِأَمۡرِهِۦٓۗ أَلَا لَهُ ٱلۡخَلۡقُ وَٱلۡأَمۡرُۗ تَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ54﴾
నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యాములలో) సృష్టించాడు. ఆ పిదప తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు. మరియు సూర్యచంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వ లోకాలకు పోషకుడు! [అల్ ఆరాఫ్ 7:54]
మరియు ప్రభువు ఆయనే ఆరాధ్యుడు. అల్లాహ్ యొక్క ఈ వాక్యము దీనికి ఆధారం:
﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱعۡبُدُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُمۡ وَٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ لَعَلَّكُمۡ تَتَّقُونَ21 ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ فِرَٰشٗا وَٱلسَّمَآءَ بِنَآءٗ وَأَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَخۡرَجَ بِهِۦ مِنَ ٱلثَّمَرَٰتِ رِزۡقٗا لَّكُمۡۖ فَلَا تَجۡعَلُواْ لِلَّهِ أَندَادٗا وَأَنتُمۡ تَعۡلَمُونَ22﴾
ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు! ఆయన యే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తి చేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా, మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి. [అల్ బఖరహ్ 2: 21-22]
ఇమామ్ ఇబ్నె కసీర్' రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు: వీటన్నిటి సృష్టికర్తే ఆరాధనకు అర్హుడు.
మరియు అల్లాహ్ ఆదేశించిన ఆరాధన రకాలు ఉదాహరణకి దుఆ (ప్రార్థన), భయం, ఆశ, అల్లాహ్ పై నమ్మకం (తవక్కుల్), ఇష్టత (రగ్బా), భీతి (రహ్బా), వినయము (ఖుషూ), భీతి (ఖష్య), మరలడం (ఇనాబా), సహాయం కోరడం (ఇస్తిఆనా), శరణు కోరడం (ఇస్తిఆదా), సహాయం కోరడం (ఇస్తిగాసా), జంతుబలి (జిబ్హ్), మొక్కుబడి (నజర్), మరియు అల్లాహ్ ఆదేశించినటువంటి ఇతర ఆరాధనలన్నీ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొరకే చెందుతాయి. దీనికి ఆధారం అల్లాహ్ వాక్కు:
﴿وَأَنَّ ٱلۡمَسَٰجِدَ لِلَّهِ فَلَا تَدۡعُواْ مَعَ ٱللَّهِ أَحَدٗا18﴾
మరియు నిశ్చయంగా, మస్జిదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించ బడ్డాయి. కావున వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి. [అల్ జిన్న్ 72:18]
ఎవరైనా వాటిలో నుంచి దేనినైనా అల్లాహ్ ను కాకుండా ఇతరుల కొరకు చేస్తే అతను ముష్రిక్ మరియు అవిశ్వాసి అవుతాడు. దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ వాక్కు:
﴿وَمَن يَدۡعُ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ لَا بُرۡهَٰنَ لَهُۥ بِهِۦ فَإِنَّمَا حِسَابُهُۥ عِندَ رَبِّهِۦٓۚ إِنَّهُۥ لَا يُفۡلِحُ ٱلۡكَٰفِرُونَ117﴾
ఇక ఎవడైనా అల్లాహ్ తో పాటు మరొక దైవాన్ని - తన వద్ద దాని కొరకు ఎలాంటి ఆధారం లేకుండానే - ప్రార్థిస్తాడో, నిశ్చయంగా అతని లెక్క అతని ప్రభువు వద్ద ఉంది. నిశ్చయంగా, సత్యతిరస్కారులు సాఫల్యము పొందలేరు. [అల్ ముమినూన్ 23:117]
మరియు హదీథులో ఇలా ఉంది:
"الدُّعَاءُ مُخُّ العِبَادَةِ".
దుఆ ఆరాధన యొక్క అసలైన పౌష్టికం, మూలం.
మరియు అల్లాహ్ యొక్క వాక్కు నుండి దీని ఆధారం:
﴿وَقَالَ رَبُّكُمُ ٱدۡعُونِيٓ أَسۡتَجِبۡ لَكُمۡۚ إِنَّ ٱلَّذِينَ يَسۡتَكۡبِرُونَ عَنۡ عِبَادَتِي سَيَدۡخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ60﴾
మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశించగలరు. [గాఫిర్ 40:60]
మరియు భయభీతి యొక్క ఆధారం, అల్లాహ్ వాక్కు నుండి:
﴿...فَلَا تَخَافُوهُمۡ وَخَافُونِ إِن كُنتُم مُّؤۡمِنِينَ﴾
కావున మీరు వారికి భయపడకండి. మరియు మీరు విశ్వాసులే అయితే, కేవలం నాకే (అల్లాహ్ కే) భయపడండి. [ఆలే ఇమ్రాన్ 3:175]
ఆశ (రజా) యొక్క ఆధారం, అల్లాహ్ యొక్క వాక్కు నుండి:
﴿...فَمَن كَانَ يَرۡجُواْ لِقَآءَ رَبِّهِۦ فَلۡيَعۡمَلۡ عَمَلٗا صَٰلِحٗا وَلَا يُشۡرِكۡ بِعِبَادَةِ رَبِّهِۦٓ أَحَدَۢا﴾
కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములుగా (షరీక్ లుగా) కల్పించుకోరాదు. [అల్ కహఫ్ 18:110]
నమ్మకం (తవక్కుల్) యొక్క ఆధారం, అల్లాహ్ వాక్కు నుండి:
﴿...وَعَلَى ٱللَّهِ فَتَوَكَّلُوٓاْ إِن كُنتُم مُّؤۡمِنِينَ﴾
అల్లాహ్ పైననే నమ్మకం ఉంచుకోండి, మీరు వాస్తవానికి విశ్వసించిన వారే అయితే! [అల్ మాయిదా 5:23]
మరియు ఆయన సెలవిచ్చాడు:
﴿...وَمَن يَتَوَكَّلۡ عَلَى ٱللَّهِ فَهُوَ حَسۡبُهُ...﴾
మరియు అల్లాహ్ మీద నమ్మకం ఉంచుకున్న వానికి ఆయనే చాలు. [అత్ తలాఖ్ 65:3]
ఇష్టత, భయభీతి మరియు వినయము యొక్క ఆధారం, అల్లాహ్ వాక్కు నుండి:
﴿...إِنَّهُمۡ كَانُواْ يُسَٰرِعُونَ فِي ٱلۡخَيۡرَٰتِ وَيَدۡعُونَنَا رَغَبٗا وَرَهَبٗاۖ وَكَانُواْ لَنَا خَٰشِعِينَ﴾
వాస్తవానికి వారు సత్కార్యాలు చేయటానికి పోటీ పడే వారు. మరియు శ్రద్ధతో మరియు భీతితో మమ్మల్ని ఆరాధించే వారు. మరియు మా సమక్షంలో వినమ్రులై ఉండేవారు. [అల్ అంబియా 21:90]
భయభీతి యొక్క ఆధారం, అల్లాహ్ వాక్కు నుండి:
﴿...فَلَا تَخۡشَوۡهُمۡ وَٱخۡشَوۡنِ...﴾
కనుక మీరు వారికి భయపడకండి, నాకే భయపడండి. [అల్ మాయిదా 5:3]
మరలడం (ఇనాబత్) యొక్క ఆధారం, అల్లాహ్ వాక్కు నుండి:
﴿وَأَنِيبُوٓاْ إِلَىٰ رَبِّكُمۡ وَأَسۡلِمُواْ لَهُ...﴾
మరియు మీరు పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపునకు మరలండి మరియు మీరు ఆయనకు విధేయులు (ముస్లింలు) అయి ఉండండి... [అజ్జుమర్ 39:54]
సహాయం అర్థించటం యొక్క ఆధారం, అల్లాహ్ వాక్కు నుండి:
﴿إِيَّاكَ نَعۡبُدُ وَإِيَّاكَ نَسۡتَعِينُ5﴾
మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము. [అల్ ఫాతిహా 1:5]
మరియు హదీథులో ఇలా ఉంది:
"إِذَا اسْتَعَنْتَ فَاسْتَعِنْ بِاللَّهِ".
మీరు సహాయాన్ని కోరినప్పుడు అల్లాహ్ తో మాత్రమే సహాయాన్ని అర్థించండి.
ఇస్తిఆజ (శరణు వేడుకోవటం) యొక్క ఆధారం, మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు నుండి:
﴿قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلۡفَلَقِ1﴾
ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను. [అల్ ఫలక్ 113:1] మరియు
﴿قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ1﴾
ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను! [అన్నాస్ 114: 1]
ఆపదలో సహాయం అర్థించటం యొక్క ఆధారం, అల్లాహ్ వాక్కు నుండి:
﴿إِذۡ تَسۡتَغِيثُونَ رَبَّكُمۡ فَٱسۡتَجَابَ لَكُمۡ...﴾
(జ్ఞాపకం చేసుకోండి!) మీరు మీ ప్రభువును సహాయం కొరకు ప్రార్థించినపుడు ఆయన ఇలా జవాబిచ్చాడు. [అల్అన్'ఫాల్ 8:9]
పశుబలి (జిబ్హ్) యొక్క ఆధారం, అల్లాహ్ వాక్కు నుండి:
﴿قُلۡ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحۡيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ162 لَا شَرِيكَ لَهُ...﴾
(ఇంకా) ఇలా అను: "నిశ్చయంగా నా నమాజ్ నా బలి (ఖుర్బానీ), నా జీవితం మరియు నా మరణం, సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్ కొరకే! ఆయనకు ఎలాంటి భాగస్వామి (సాటి) లేడు... [అల్ అన్ఆమ్ 6:162-163]
హదీథు నుండి:
"لَعَنَ اللَّهُ مَنْ ذَبَحَ لِغَيْرِ اللَّهِ".
అల్లాహేతరులకు బలి ఇచ్చిన వాడిపై అల్లాహ్ శాపం ఉండును.
మొక్కుబడి (నద్ర్) యొక్క ఆధారం, అల్లాహ్ వాక్కు నుండి:
﴿يُوفُونَ بِٱلنَّذۡرِ وَيَخَافُونَ يَوۡمٗا كَانَ شَرُّهُۥ مُسۡتَطِيرٗا7﴾
వారు తమ మొక్కుబడులను పూర్తి చేసుకున్నవారై ఉంటారు. మరియు దాని హాని అన్ని వైపులా క్రమ్ముకొనే, ఆ దినమును గురించి భయపడుతూ ఉంటారు. [అల్ ఇన్సాన్ 76:7]
[రెండవ ప్రాథమిక సూత్రము]
ప్రమాణాలతో ఇస్లాం ధర్మాన్ని గురించి తెలుసుకోవడం. అది: అల్లాహ్ కొరకు ఏకత్వాన్ని స్వీకరించడం, విధేయత ద్వారా ఆయనను అనుసరించటం, షిర్క్ మరియు ముష్రికుల నుంచి దూరంగా ఉండటం.
మరియు దానిలో మూడు స్థాయిలు కలవు: ఇస్లాం, ఈమాన్ మరియు ఇహ్సాన్.
ప్రతీ స్థానానికి మూలాధారాలు, మూలస్థంభాలు ఉన్నాయి.
మొదటి స్థాయి: ఇస్లాం
ఇస్లాం యొక్క మూలస్థంభాలు ఐదు: అల్లాహ్ తప్ప వేరొక నిజ ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం, నమాజు నెలకొల్పటం, జకాత్ దానం ఇవ్వటం, రమదాన్ ఉపవాసములు పాటించడం, అల్లాహ్ పవిత్ర గృహము యొక్క హజ్ చేయటం.
ఈ సాక్ష్యప్రకటనకు ఆధారం అల్లాహ్ యొక్క ఈ వాక్కు:
﴿شَهِدَ ٱللَّهُ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّا هُوَ وَٱلۡمَلَٰٓئِكَةُ وَأُوْلُواْ ٱلۡعِلۡمِ قَآئِمَۢا بِٱلۡقِسۡطِۚ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ18﴾
నిశ్చయంగా, ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడని, అల్లాహ్, దైవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు; ఆయనే న్యాయపరిరక్షకుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడు! ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు. [ఆలె ఇమ్రాన్ 3:18]
దీని అర్థము ఏమిటంటే ఏకైక అల్లాహ్ తప్ప మరెవ్వరూ వాస్తవ ఆరాధ్యుడు కాదు.
లా ఇలాహ: అల్లాహ్ ను వదిలి ఆరాధించబడే వాటన్నిటినీ నిరాకరించడం.
(ఇల్లల్లాహ్): అల్లాహ్ నే ఆరాధించడాన్ని నిర్ధారించడం. ఆయన ఆరాధనలో ఆయనకు భాగస్వామి లేడు, అలాగే ఆయన సార్వభౌమాధికారంలో ఆయనకు భాగస్వామి లేడు.
అల్లాహ్ ఈ వాక్కు దాని వ్యాఖ్యానమును వివరిస్తుంది:
﴿وَإِذۡ قَالَ إِبۡرَٰهِيمُ لِأَبِيهِ وَقَوۡمِهِۦٓ إِنَّنِي بَرَآءٞ مِّمَّا تَعۡبُدُونَ26 إِلَّا ٱلَّذِي فَطَرَنِي..﴾
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్ తన తండ్రి మరియు తన జాతివారితో ఇలా అన్నప్పుడు: "నిశ్చయంగా, మీరు పూజించే వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు. (నేనైతే) నన్ను సృజించిన ఆయన (అల్లాహ్ నే ఆరాధిస్తాను). [జుఖ్'రుఫ్ 43:26-27]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿قُلۡ يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ تَعَالَوۡاْ إِلَىٰ كَلِمَةٖ سَوَآءِۭ بَيۡنَنَا وَبَيۡنَكُمۡ أَلَّا نَعۡبُدَ إِلَّا ٱللَّهَ وَلَا نُشۡرِكَ بِهِۦ شَيۡـٔٗا وَلَا يَتَّخِذَ بَعۡضُنَا بَعۡضًا أَرۡبَابٗا مِّن دُونِ ٱللَّهِۚ فَإِن تَوَلَّوۡاْ فَقُولُواْ ٱشۡهَدُواْ بِأَنَّا مُسۡلِمُونَ64﴾
ఇలా అను: " ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే: 'మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్ట రాదు మరియు అల్లాహ్ తప్ప, మనవారిలో నుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు." వారు (సమ్మతించక) తిరిగి పోతే: "మేము నిశ్చయంగా అల్లాహ్ కు విధేయులం, దీనికి మీరు సాక్షులుగా ఉండండి." అని పలుకు. [ఆలి ఇమ్రాన్ 3:64]
ముహమ్మద్, అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యానికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ వాక్కు:
﴿لَقَدۡ جَآءَكُمۡ رَسُولٞ مِّنۡ أَنفُسِكُمۡ عَزِيزٌ عَلَيۡهِ مَا عَنِتُّمۡ حَرِيصٌ عَلَيۡكُم بِٱلۡمُؤۡمِنِينَ رَءُوفٞ رَّحِيمٞ128﴾
(ఓ ప్రజలారా!) వాస్తవానికి, మీ వద్దకు మీలో నుంచే ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి ఉన్నాడు; మీరు ఆపదకు గురి కావటం అతనికి కష్టం కలిగిస్తుంది; అతను మీ మేలు కోరేవాడు, విశ్వాసుల ఎడల కనికరుడు, కరుణామయుడు. [తౌబహ్ 9:128]
ముహమ్మద్, అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యమివ్వటం యొక్క అర్థము: ఆయన ఆదేశించిన వాటి విషయంలో ఆయనను అనుసరించటం మరియు ఆయన తెలిపిన వాటి విషయంలో ఆయనను నమ్మటం మరియు ఆయన వారించిన, మందలించిన వాటి నుండి దూరంగా ఉండటం మరియు ఆయన ధర్మశాసనం చేసిన వాటి ద్వారా మాత్రమే అల్లాహ్ ను ఆరాధించటం అనివార్యము.
నమాజు, జకాతు, మరియు తౌహీదు వివరణ గురించి ఆధారం అల్లాహ్ యొక్క ఈ వాక్కు:
﴿وَمَآ أُمِرُوٓاْ إِلَّا لِيَعۡبُدُواْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ حُنَفَآءَ وَيُقِيمُواْ ٱلصَّلَوٰةَ وَيُؤۡتُواْ ٱلزَّكَوٰةَۚ وَذَٰلِكَ دِينُ ٱلۡقَيِّمَةِ5﴾
మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ ను స్థాపించాలని మరియు జకాత్ ఇవ్వాలని. ఇదే సరైన ధర్మము. [అల్ బయ్యినహ్ 98:5]
ఉపవాసాలు ఉండటం యొక్క ఆధారం, అల్లాహ్ వాక్కు నుండి:
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ كُتِبَ عَلَيۡكُمُ ٱلصِّيَامُ كَمَا كُتِبَ عَلَى ٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ لَعَلَّكُمۡ تَتَّقُونَ183﴾
ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించ బడింది, ఏ విదంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబ ఉండెనో బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని! [అల్ బఖరహ్ 2:183]
హజ్ యొక్క ఆధారం, మహోన్నతుడై అల్లాహ్ వాక్కు నుండి:
﴿وَلِلَّهِ عَلَى ٱلنَّاسِ حِجُّ ٱلۡبَيۡتِ مَنِ ٱسۡتَطَاعَ إِلَيۡهِ سَبِيلٗاۚ وَمَن كَفَرَ فَإِنَّ ٱللَّهَ غَنِيٌّ عَنِ ٱلۡعَٰلَمِينَ97﴾
మరియు అక్కడికి పోవటానికి, శక్తిగలవారికి ఆ గృహయాత్ర (హిజ్జుల్ బైత్) అల్లాహ్ (ప్రసన్నత) కొరకు చేయటం, విధిగా చేయబడింది. ఎవరు దీనిని తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ సమస్త లోకాల వారి అవసరం లేని స్వయం సమృద్ధుడు (అని తెలుసుకోవాలి). [ఆలె ఇమ్రాన్ 3:97]
రెండవ స్థాయి: విశ్వాసం (ఈమాన్)
దీనికి డెబ్బైకి పైగా శాఖలు ఉన్నాయి. అందులో 'లా ఇలాహ ఇల్లల్లాహ్' వాక్యం పలకడం అత్యున్నతమైనది అయితే, దారి నుండి హానికరమైన దానిని తొలగించడం అత్యల్పమైనది. మరియు సిగ్గు (బిడియం) విశ్వాసపు శాఖలలో ఒక శాఖ.
మరియు దీనికి ఆరు మూలస్థంభాలు ఉన్నాయి: నీవు అల్లాహ్ పై, ఆయన దూతలపై, ఆయన గ్రంథములపై, ఆయన ప్రవక్తలపై మరియు అంతిమదినంపై విశ్వాసము ఉంచటం మరియు నీవు విధివ్రాతపై దాని మంచి, చెడులపై విశ్వాసము ఉంచటం.
ఈ ఆరు మూలస్థంభాలకు ఆధారం అల్లాహ్ యొక్క ఈ వాక్కు:
﴿لَّيۡسَ ٱلۡبِرَّ أَن تُوَلُّواْ وُجُوهَكُمۡ قِبَلَ ٱلۡمَشۡرِقِ وَٱلۡمَغۡرِبِ وَلَٰكِنَّ ٱلۡبِرَّ مَنۡ ءَامَنَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَٱلۡمَلَٰٓئِكَةِ وَٱلۡكِتَٰبِ وَٱلنَّبِيِّـۧنَ...﴾
వినయ విధేయత (ధర్మనిష్ఠాపరత్వం) అంటే మీరు మీ ముఖాలను తూర్పు దిక్కునకో, లేక పడమర దిక్కునకో చేయటం కాదు; కాని వినయ విధేయత (ధర్మనిష్ఠాపరత్వం) అంటే, అల్లాహ్ ను, అంతిమదినాన్ని, దేవదూతలను, ప్రతి దివ్యగ్రంథాన్ని మరియు ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించడం... [అల్ బఖరహ్ 2:177]
విధివ్రాత యొక్క ఆధారం, అల్లాహ్ యొక్క ఈ వాక్కు నుండి:
﴿إِنَّا كُلَّ شَيۡءٍ خَلَقۡنَٰهُ بِقَدَرٖ49﴾
నిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక విధివ్రాత (ఖద్ర్) తో సృష్టించాము. [అల్ ఖమర్ 54: 49]
మూడవ స్థాయి: ఇహ్'సాన్
ఇది ఒకే ఒక మూలనియమం. అదేమిటంటే: నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆయనను ఆరాధించటం. ఒకవేళ నీవు ఆయనను చూస్తున్నట్లు భావించలేకపోతే, ఆయన నిన్ను చూస్తున్నాడని భావిస్తూ ఆయనను ఆరాధించడం.
మరియు అల్లాహ్ యొక్క వాక్కుల నుండి ఆధారం:
﴿إِنَّ ٱللَّهَ مَعَ ٱلَّذِينَ ٱتَّقَواْ وَّٱلَّذِينَ هُم مُّحۡسِنُونَ128﴾
నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గల వారితో మరియు సజ్జనులైన వారితో పాటు ఉంటాడు. [అన్ నహ్ల్ 16:128]
﴿وَتَوَكَّلۡ عَلَى ٱلۡعَزِيزِ ٱلرَّحِيمِ217 ٱلَّذِي يَرَىٰكَ حِينَ تَقُومُ218 وَتَقَلُّبَكَ فِي ٱلسَّٰجِدِينَ219﴾
మరియు ఆ సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత మీద నమ్మకం ఉంచుకో! ఆయన నీవు నిలిచినపుడు, నిన్ను చూస్తున్నాడు. మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారితో నీ రాకపోకడలను కూడా! [షు'అరా 26:217-219]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَمَا تَكُونُ فِي شَأۡنٖ وَمَا تَتۡلُواْ مِنۡهُ مِن قُرۡءَانٖ وَلَا تَعۡمَلُونَ مِنۡ عَمَلٍ إِلَّا كُنَّا عَلَيۡكُمۡ شُهُودًا إِذۡ تُفِيضُونَ فِيهِ...﴾
మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ కార్యంలో ఉన్నా మరియు ఖుర్ఆన్ నుండి నీవు దేనిని పఠిస్తూ ఉన్నా మరియు (ఓ మానవులారా!) మీరు ఏమి చేస్తూ ఉన్నా! మీరు మీ పనులలో నిమగ్నులై ఉన్నప్పుడు, మేము మిమ్మల్ని కనిపెట్టుకునే ఉంటాము... [యూనుస్ 10:61]
సున్నతు నుండి: ప్రసిద్ధ హదీథు జిబ్రయీల్ ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ఆయన ఇలా సెలవిచ్చారు:
"بَيْنَمَا نَحْنُ عِنْدَ رَسُولِ اللَّهِ ﷺ ذَاتَ يَوْمٍ، إِذْ طَلَعَ عَلَيْنَا رَجُلٌ، شَدِيدُ بَيَاضِ الثِّيَابِ، شَدِيدُ سَوَادِ الشَّعَرِ، لَا يُرَى عَلَيْهِ أَثَرُ السَّفَرِ، وَلَا يَعْرِفُهُ مِنَّا أَحَدٌ، حَتَّى جَلَسَ إِلَى النَّبِيِّ ﷺ فَأَسْنَدَ رُكْبَتَيْهِ إِلَى رُكْبَتَيْهِ، وَوَضَعَ كَفَّيْهِ عَلَى فَخِذَيْهِ، وَقَالَ: يَا مُحَمَّدُ !
ఒకరోజు మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో కూర్చొని ఉండగా, అకస్మాత్తుగా ఒక వ్యక్తి మా వద్దకు వచ్చాడు. అతను అతి తెల్లని దుస్తులు ధరించి, బాగా నల్లని తలవెంట్రుకలు కలిగి ఉన్నాడు. అతనిలో ప్రయాణ బడలిక ఏమీ కనిపించలేదు మరియు మాలో ఎవరూ అతన్ని గుర్తుపట్టలేదు. అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, తన మోకాళ్ళను ఆయన మోకాళ్ళకు ఆనిస్తూ, తన అరచేతులను ఆయన తొడలపై పెట్టి, 'ఓ ముహమ్మద్!' అని ఇలా అన్నాడు,
أَخْبِرْنِي عَنِ الإِسْلَامِ؟
నాకు ఇస్లాం అంటే ఏమిటి? తెలియజేయండి
فَقَالَ رَسُولُ اللَّهِ ﷺ: الإِسْلَامُ: أَنْ تَشْهَدَ أَلَّا إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ، وَتُقِيمَ الصَّلَاةَ، وَتُؤْتِيَ الزَّكَاةَ، وَتَصُومَ رَمَضَانَ، وَتَحُجَّ البَيْتَ إِنِ اسْتَطَعْتَ إِلَيْهِ سَبِيلًا، قَالَ: صَدَقْتَ - فَعَجِبْنَا لَهُ، يَسْأَلُهُ وَيُصَدِّقُهُ –.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ఇస్లాం అంటే: అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం, నమాజు స్థాపించడం, జకాతు చెల్లించడం, రమదాను ఉపవాసాలు ఉండటం, స్తోమత ఉన్నట్లయితే అల్లాహ్ గృహం హజ్జ్ చేయడం. అతను, 'మీరు సత్యం పలికారు' అన్నాడు. - అతనే ప్రశ్నించి, అతనే సమర్థించడం చూసి మాకు ఆశ్చర్యం కలిగింది -
قَالَ: فَأَخْبِرْنِي عَنِ الْإِيمَانِ؟
అపుడు అతడు, "ఇక ఈమాన్ (విశ్వాసం) గురించి నాకు తెలుపండి?" అని అడిగాడు.
قَالَ: أَنْ تُؤْمِنَ بِاللَّهِ، وَمَلَائِكَتِهِ، وَكُتُبِهِ، وَرُسُلِهِ، وَاليَوْمِ الْآخِرِ، وَتُؤْمِنَ بِالقَدَرِ خَيْرِهِ وَشَرِّهِ، قَالَ: صَدَقْتَ.
దానికి ఆయన ఇలా అన్నారు - నీవు అల్లాహ్ పై, ఆయన దూతలపై, ఆయన గ్రంథములపై, ఆయన ప్రవక్తల పై మరియు అంతిమ దినంపై విశ్వాసము ఉంచటం మరియు నీవు విధివ్రాతపై దాని మంచి, చెడులపై విశ్వాసము ఉంచటం. దానికి అతను ‘మీరు నిజం పలికారు’ అని అన్నాడు.
قَالَ: فَأَخْبِرْنِي عَنِ الْإِحْسَانِ؟
అపుడు అతను ఇలా అన్నాడు: "ఇహ్సాన్ గురించి నాకు చెప్పండి?
قَالَ: أَنْ تَعْبُدَ اللَّهَ كَأَنَّكَ تَرَاهُ، فَإِنْ لَمْ تَكُنْ تَرَاهُ فَإِنَّهُ يَرَاكَ.
దానికి ఆయన ఇలా అన్నారు: నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆయనను ఆరాధించటం. ఒకవేళ నీవు ఆయనను చూస్తున్నట్లు భావించలేకపోతే, ఆయన నిన్ను చూస్తున్నాడు అని భావిస్తూ ఆయనను ఆరాధించటం.
قَالَ: فَأَخْبِرْنِي عَنِ السَّاعَةِ؟
అపుడు అతను ‘అయితే నాకు ప్రళయ ఘడియ గురించి తెలియజేయండి?’ అని ప్రశ్నించాడు.
قَالَ: مَا المَسْؤُولُ عَنْهَا بِأَعْلَمَ مِنَ السَّائِلِ.
దానికి ఆయన, "ఈ విషయం గురించి ప్రశ్నించబడే వాడికి ప్రశ్నించే వాడి కన్నా ఎక్కువేమీ తెలియదు" అన్నారు.
قَالَ: فَأَخْبِرْنِي عَنْ أَمَارَاتِهَا؟
అపుడు అతను, “అయితే దాని సూచనల గురించి నాకు తెలియజేయండి?” అని అడిగాడు.
قَالَ: أَنْ تَلِدَ الأَمَةُ رَبَّتَهَا، وَأَنْ تَرَى الحُفَاةَ العُرَاةَ العَالَةَ رِعَاءَ الشَّاءِ، يَتَطَاوَلُونَ فِي البُنْيَانِ.
దానికి ఆయన ఇలా అన్నారు: "బానిస స్త్రీ తన యజమానురాలికి జన్మనిస్తుంది, మరియు పాదరక్షలు లేని, నగ్నులైన, నిరుపేదలైన గొర్రెల కాపరులు ఎత్తైన భవనాల నిర్మాణంలో ఒకరితో ఒకరు పోటీ పడటాన్ని మీరు చూస్తారు.
قَالَ: ثُمَّ انْطَلَقَ فَلَبِثْتُ مَلِيًّا، ثُمَّ قَالَ لِي: يَا عُمَرُ! أَتَدْرِي مَنِ السَّائِلُ؟ قُلْتُ: اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: فَإِنَّهُ جِبْرِيلُ، أَتَاكُمْ يُعَلِّمُكُمْ دِينَكُمْ".
తరువాత ఆ మనిషి వెళ్ళిపోయాడు. నేను కొద్దిసేపు అలాగే ఉండిపోయాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో “ఓ ఉమర్! ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎవరో తెలుసా నీకు?” అన్నారు. నేను “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరుని కి మాత్రమే బాగా తెలుసు” అన్నాను. దానికి ఆయన “అతడు జిబ్రయీల్ అలైహిస్సలాం, మీకు మీ ధర్మాన్ని బోధించడానికి వచ్చారు” అన్నారు.
[మూడవ ప్రాథమిక సూత్రము]
మీ ప్రవక్త ముహమ్మద్ ﷺ గురించి తెలుసుకోవడం: ఆయన ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్. హాషిమ్ ఖురైష్ తెగకు చెందిన వారు. ఖురైష్ అరేబియా తెగలలోని ఒక తెగ. అరబ్ వాసులు ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ బిన్ ఇస్మాయీల్ సంతానం. ఆయనపై మరియు మన ప్రవక్త పై అల్లాహ్ శుభశాంతులు కురియుగాక.
ఆయన పూర్తి వయస్సు 63 సంవత్సరాలు – వాటిలో నుంచి 40 సంవత్సరాలు నుబువ్వత్ కన్న ముందువి, మరియు 23 సంవత్సరాలు ప్రవక్తగా, సందేశహరునిగా గడిపారు.
ఇఖ్రా ద్వారా ప్రవక్త (నబీ)అయ్యారు, ముద్దస్సిర్ ద్వారా సందేశహరులు(రసూల్) అయ్యారు మరియు ఆయన స్వస్థలం మక్కా.
అల్లాహ్ ఆయనను షిర్క్ నుండి హెచ్చరించమని మరియు ఏకదైవోపాసన వైపు పిలవమని పంపించాడు. అల్లాహ్ యొక్క ఈ వాక్కు దీనికి ఆధారం:
﴿يَٰٓأَيُّهَا ٱلۡمُدَّثِّرُ1 قُمۡ فَأَنذِرۡ2 وَرَبَّكَ فَكَبِّرۡ3 وَثِيَابَكَ فَطَهِّرۡ4 وَٱلرُّجۡزَ فَٱهۡجُرۡ5 وَلَا تَمۡنُن تَسۡتَكۡثِرُ6 وَلِرَبِّكَ فَٱصۡبِرۡ7﴾
ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా! లే! ఇక హెచ్చరించు! మరియు మీ ప్రభువు గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)! మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో! మరియు మాలిన్యానికి దూరంగా ఉండు! మరియు ఎక్కువ పొందాలనే ఆశతో ఇవ్వకు (ఉపకారం చేయకు)! మరియు నీ ప్రభువు కొరకు సహనం వహించు! [అల్ ముద్దస్సిర్ 74:1-7]
మరియు అర్థము,
﴿قُمۡ فَأَنذِرۡ﴾
లే! ఇక హెచ్చరించు! షిర్క్ నుండి హెచ్చరించు మరియు తౌహీద్ వైపు ఆహ్వానించు.
﴿وَرَبَّكَ فَكَبِّرۡ﴾
మరియు మీ ప్రభువు గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)! అంటే తౌహీద్ ద్వారా ఆయన గొప్పతనమును కొనియాడు.
﴿وَثِيَابَكَ فَطَهِّرۡ﴾
మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో! అంటే మీ కర్మలను షిర్క్ తో కల్పితం చేయకుండా శుభ్రముగా ఉంచు.
﴿وَٱلرُّجۡزَ فَٱهۡجُرۡ﴾
మరియు మాలిన్యానికి దూరంగా ఉండు! అంటే రుజ్'జ అంటే విగ్రహాలు. హజ్రుహా అంటే వాటిని మరియు వాటిని పూజించే వారిని విడనాడు. వాటి నుండి మరియు వాటిని పూజించే వారి నుండి సంబంధం వదులుకో.
ఈ ఒక్క మాటపైనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది సంవత్సరాల వరకు తౌహీద్ వైపు పిలుస్తూ ఉండిపోయారు. పది సంవత్సరాల తర్వాత ఆయనకు ఆకాశం వైపునకు మేరాజ్ (గగన యాత్ర) చేయించబడినది. మరియు ఆయనపై ఐదు పూటల నమాజులు విధిగావించబడినవి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సంవత్సరాల వరకు మక్కా నగరంలో నమాజు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మదీనా వైపు హిజ్రత్ (వలస) చేయమని ఆయనకు ఆదేశించబడినది.
హిజ్రత్ అంటే ధర్మరక్షణ ఉద్దేశ్యం తో కుఫ్ర్ మరియు షిర్కు ప్రాంతం నుండి ఇస్లాం నగరముల వైపునకు వలస వెళ్ళడం.
షిర్క్ జరిగే ప్రదేశం నుండి ఇస్లాం ప్రకారం ఆచరించగలిగే ప్రదేశమునకు హిజ్రత్ చేయటం ఈ ఉమ్మత్ పై విధి. ఇది ప్రళయం ఏర్పడే వరకు ఉండే విధి.
మరియు అల్లాహ్ యొక్క వాక్కు నుండి ఆధారం:
﴿إِنَّ ٱلَّذِينَ تَوَفَّىٰهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ ظَالِمِيٓ أَنفُسِهِمۡ قَالُواْ فِيمَ كُنتُمۡۖ قَالُواْ كُنَّا مُسۡتَضۡعَفِينَ فِي ٱلۡأَرۡضِۚ قَالُوٓاْ أَلَمۡ تَكُنۡ أَرۡضُ ٱللَّهِ وَٰسِعَةٗ فَتُهَاجِرُواْ فِيهَاۚ فَأُوْلَٰٓئِكَ مَأۡوَىٰهُمۡ جَهَنَّمُۖ وَسَآءَتۡ مَصِيرًا97 إِلَّا ٱلۡمُسۡتَضۡعَفِينَ مِنَ ٱلرِّجَالِ وَٱلنِّسَآءِ وَٱلۡوِلۡدَٰنِ لَا يَسۡتَطِيعُونَ حِيلَةٗ وَلَا يَهۡتَدُونَ سَبِيلٗا98﴾
నిశ్చయంగా, తమకు తాము (తమ ఆత్మలకు) అన్యాయం చేసుకుంటూ ఉండే వారి ప్రాణాలను తీసే దేవదూతలు వారితో: "మీరు ఏ స్థితిలో ఉండేవారు?" అని అడిగితే, వారు: "మేము భూమిలో బలహీనులముగా, నిస్సహాయులముగా ఉండేవారము!" అని జవాబిస్తారు. దానికి (దేవదూతలు): "ఏమీ? మీరు వలస పోవటానికి అల్లాహ్ భూమి విశాలంగా లేకుండెనా?" అని అడుగుతారు. ఇలాంటి వారి శరణం నరకమే. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం! కాని, నిజంగానే నిస్సహాయులై, వలస పోవటానికి ఏ సాధనా సంపత్తీ, ఎలాంటి మార్గం లేని పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు తప్ప! [అన్నిసా 4:97-98]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿يَٰعِبَادِيَ ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِنَّ أَرۡضِي وَٰسِعَةٞ فَإِيَّٰيَ فَٱعۡبُدُونِ56﴾
ఓ విశ్వసించిన నా దాసులారా! నిశ్చయంగా, నా భూమి ఎంతో విశాలమైనది. కావున మీరు కేవలం నన్నే ఆరాధించండి. [అల్-అన్'కబూత్ 29:56]
ఇమామ్ బగవీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు: ఈ ఆయతు ఎవరైతే హిజ్రత్ చేయకుండా మక్కాలో ఉన్నారో ఆ ముస్లింల గురించి అవతరించబడినది. అల్లాహ్ వారిని మోమిన్ పేరుతో పిలిచాడు" .
హిజ్రత్ గురించి సున్నత్ నుండి ఆధారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాక్కు:
"لَا تَنْقَطِعُ الهِجْرَةُ حَتَّى تَنْقَطِعَ التَّوْبَةُ، وَلَا تَنْقَطِعُ التَّوْبَةُ حَتَّى تَطْلُعَ الشَّمْسُ مِنْ مَغْرِبِهَا".
తౌబా అంతమయ్యే వరకు హిజ్రత్ అంతమవదు. సూర్యుడు పడమర నుండి ఉదయించేంత వరకు తౌబా అంతమవదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో స్థిరపడిన తర్వాత మిగితా ఇస్లామీయ ధర్మోపదేశాలు ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు: జకాత్, ఉపవాసాలు, హజ్, అదాన్, జిహాద్, మంచి చేయమని ఆశించటం, చెడు నుండి వారించటం. వీటికి కట్టుబడి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది సంవత్సరాల వరకు జీవించారు.
మరియు ఆ తర్వాత ఆయన మరణించారు. ఆయనపై అల్లాహ్ శుభాలు మరియు శాంతి కురియుగాక. ఆయన ధర్మం ప్రళయం వరకు ఉండిపోయేది. మరియు ఇది ఆయన ధర్మం. ప్రతీ మంచిపని చేయమని ఆయన ఉమ్మత్ ను (సమాజాన్ని) ఆదేశించారు. మరియు ప్రతీ చెడు నుండి వారించారు.
ఆయన సూచించిన శుభమైన విషయాలు – తౌహీదు (ఏకదైవారాధన), అల్లాహ్ ఇష్టపడేవన్నీ మరియు సంతుష్టపడేవన్నీ.
ఆయన వారించిన చెడు విషయాలు - షిర్కు మరియు అల్లాహ్ అసహ్యించుకున్నవన్నీ మరియు నిరాకరించినవన్నీ.
ఆయనను అల్లాహ్ సర్వమానవాళి కొరకు సందేశహరుడుగా పంపించాడు. మొత్తం మానవులు, జిన్నాతులందరు ఆయనకు విధేయత చూపాలని విధిగావించాడు. అల్లాహ్ యొక్క ఈ వాక్కు దానికి ఆధారం :
﴿قُلۡ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنِّي رَسُولُ ٱللَّهِ إِلَيۡكُمۡ جَمِيعًا...﴾
(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను... [అల్ అఅ్ రాఫ్ 7:158]
అల్లాహ్ ఆయనతో ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు; అల్లాహ్ యొక్క ఈ వాక్యము దీనికి ఆధారం :
﴿...ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗاۚ...﴾
ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను. [అల్ మాయిదా 5:3]
ప్రవక్త (స) మరణిస్తారని అల్లాహ్ యొక్క వాక్కు ఆధారం:
﴿إِنَّكَ مَيِّتٞ وَإِنَّهُم مَّيِّتُونَ30 ثُمَّ إِنَّكُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ عِندَ رَبِّكُمۡ تَخۡتَصِمُونَ31﴾
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, (ఒక రోజు) నీవు మరణిస్తావు మరియు నిశ్చయంగా వారు కూడా మరణిస్తారు. ఆ తరువాత నిశ్చయంగా, పునరుత్థాన దినమున మీరంతా మీ ప్రభువు సమక్షంలో మీ వివాదాలను విన్నవించుకుంటారు. [అజ్జుమర్ 39:30-31]
మరియు ప్రజలందరు మరణించిన తర్వాత ఫలితాలను పొందటానికి లేపబడుతారు. అల్లాహ్ యొక్క ఈ వాక్కు దానికి ఆధారం :
﴿مِنۡهَا خَلَقۡنَٰكُمۡ وَفِيهَا نُعِيدُكُمۡ وَمِنۡهَا نُخۡرِجُكُمۡ تَارَةً أُخۡرَىٰ55﴾
దాని (ఆ మట్టి) నుంచే మిమ్మల్ని సృష్టించాము, మరల మిమ్మల్ని దానిలోకే చేర్చుతాము మరియు దాని నుంచే మిమ్మల్ని మరొకసారి లేవుతాము. [తాహా 20:55]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَٱللَّهُ أَنۢبَتَكُم مِّنَ ٱلۡأَرۡضِ نَبَاتٗا17 ثُمَّ يُعِيدُكُمۡ فِيهَا وَيُخۡرِجُكُمۡ إِخۡرَاجٗا18﴾
మరియు అల్లాహ్ యే మిమ్మల్ని భూమి (మట్టి) నుండి ఉత్పత్తి చేశాడు! తరువాత ఆయన మిమ్మల్ని అందులోకే తీసుకొని పోతాడు మరియు మిమ్మల్ని దాని నుండి (బ్రతికించి) బయటికి తీస్తాడు! [నూహ్ 71:17-18]
మరణాంతరం లేపబడిన తర్వాత వారు లెక్క తీసుకో బడుతారు మరియు పాపపుణ్య కర్మల ప్రతిఫలం ప్రసాదించ బడుతారు. అల్లాహ్ యొక్క ఈ వాక్కు దీనికి ఆధారం:
﴿...لِيَجۡزِيَ ٱلَّذِينَ أَسَٰٓـُٔواْ بِمَا عَمِلُواْ وَيَجۡزِيَ ٱلَّذِينَ أَحۡسَنُواْ بِٱلۡحُسۡنَى﴾
దుష్టులకు వారి కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికి మరియు సత్కార్యాలు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటానికి. [అన్నజ్మ్ 53:31]
ఎవరైన మరణాంతర జీవితాన్ని నిరాకరిస్తే అతను అవిశ్వాసి. అల్లాహ్ యొక్క ఈ వాక్కు దీనికి ఆధారం:
﴿زَعَمَ ٱلَّذِينَ كَفَرُوٓاْ أَن لَّن يُبۡعَثُواْۚ قُلۡ بَلَىٰ وَرَبِّي لَتُبۡعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلۡتُمۡۚ وَذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ7﴾
సత్యాన్ని తిరస్కరించినవారు (చనిపోయిన తర్వాత) మరల సజీవులుగా లేపబడమని భావిస్తున్నారు. వారితో ఇలా అను: "అది కాదు, నా ప్రభువు సాక్షిగా! మీరు తప్పకుండా లేపబడ తారు. తరువాత మీరు చేసిందంతా మీకు తెలుప బడుతుంది. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం. [అత్తగాబున్ 64:7]
అల్లాహ్ తఆలా ప్రవక్తలందరిని శుభవార్తనిచ్చేవారిగా, హెచ్చరించే వారిగా చేసి పంపించాడు. అల్లాహ్ యొక్క ఈ వాక్కు దీనికి ఆధారం:
﴿رُّسُلٗا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى ٱللَّهِ حُجَّةُۢ بَعۡدَ ٱلرُّسُلِۚ...﴾
(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని! [అన్నిసా 4:165]
వారిలో నూహ్ అలైహిస్సలాం మొట్టమొదటివారు మరియు వారిలో చిట్టచివరివారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనే ప్రవక్తల పరంపరకు పరిసమాప్తి, ఆయన తరువాత ఏ ప్రవక్త లేడు. మరియు దీనికి నిదర్శనం అల్లాహ్ యొక్క ఈ వాక్కు:
﴿مَّا كَانَ مُحَمَّدٌ أَبَآ أَحَدٖ مِّن رِّجَالِكُمۡ وَلَٰكِن رَّسُولَ ٱللَّهِ وَخَاتَمَ ٱلنَّبِيِّـۧنَ...﴾
(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు... [అల్ అహ్’జాబ్ 33:40]
వారిలో నూహ్ అలైహిస్సలాం మొట్టమొదటివారు అనటానికి ఆధారం అలాహ్ యొక్క ఈ వాక్కు:
﴿إِنَّآ أَوۡحَيۡنَآ إِلَيۡكَ كَمَآ أَوۡحَيۡنَآ إِلَىٰ نُوحٖ وَٱلنَّبِيِّـۧنَ مِنۢ بَعۡدِهِ...﴾
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నూహ్ కు మరియు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు సందేశం (వహీ) పంపినట్లు, నీకు కూడా సందేశం పంపాము... [అన్నిసా 4:163]
నూహ్ అలైహిస్సలాం మొదలుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ప్రతి జాతిలోను అల్లాహ్ సందేశహరులను పంపించాడు. వారు ప్రజలను ఒక్క అల్లాహ్ ఆరాధన చేయమని ఆదేశించేవారు. మరియు తాగూత్ ఆరాధన నుండి వారించేవారు. అల్లాహ్ యొక్క ఈ వాక్కు దీనికి ఆధారం:
﴿وَلَقَدۡ بَعَثۡنَا فِي كُلِّ أُمَّةٖ رَّسُولًا أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ وَٱجۡتَنِبُواْ ٱلطَّٰغُوتَ...﴾
మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి... [అన్నహల్ 16:36]
అల్లాహ్ తన దాసులందరిపై తాగూత్ ను తిరస్కరించటాన్ని మరియు అల్లాహ్ పై విశ్వాసం చూపుటను అనివార్యం చేశాడు.
ఇబ్నుల్ ఖయ్యిమ్' రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు: తాగూత్ అర్థము: దాసుడు దేని ద్వారానైతే తన హద్దును దాటుతాడో, అది ఆరాధించబడేది కావచ్చు, అనుసరించబడేది కావచ్చు లేదా విధేయత చూపబడేది కావచ్చు.
తాగూత్ లు చాలా ఉన్నాయి. వాటిలో ప్రథమ స్థానంలోనివి అయిదు, అవి: 1) అల్లాహ్ శపించిన ఇబ్లీస్, 2) తను పూజింప బడుతున్నప్పుడు దానిని మెచ్చుకునేవాడు, 3) తనను పూజించమని ప్రజలను ఆహ్వానించే వాడు, 4) తనకు అగోచర జ్ఞానం ఉన్నదని చాటింపు చేసుకునే వాడు, 5) అల్లాహ్ అవతరింపజేసిన ధర్మానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పేవాడు.
మరియు అల్లాహ్ యొక్క వాక్కు నుండి ఆధారం:
﴿لَآ إِكۡرَاهَ فِي ٱلدِّينِۖ قَد تَّبَيَّنَ ٱلرُّشۡدُ مِنَ ٱلۡغَيِّۚ فَمَن يَكۡفُرۡ بِٱلطَّٰغُوتِ وَيُؤۡمِنۢ بِٱللَّهِ فَقَدِ ٱسۡتَمۡسَكَ بِٱلۡعُرۡوَةِ ٱلۡوُثۡقَىٰ لَا ٱنفِصَامَ لَهَاۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ256﴾
ధర్మం విషయంలో బలవంతం లేదు. వాస్తవానికి సన్మార్గం (రుష్ద్) దుర్మార్గం నుండి సుస్పష్టం చేయబడింది. కావున కల్పితదైవాన్ని (తాగూత్ ను) తిరస్కరించి, అల్లాహ్ ను విశ్వసించిన వాడు, సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆధారాన్ని పట్టుకున్నట్లే. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. [అల్ బఖరహ్ 2:256]
ఇదియే 'లా ఇలాహ ఇల్లల్లాహ్' అర్థము, మరియు హదీథ్ లో:
"رَأْسُ الأَمْرِ: الإِسْلَامُ، وَعَمُودُهُ: الصَّلَاةُ، وَذِرْوَةُ سَنَامِهِ: الجِهَادُ فِي سَبِيلِ اللَّهِ".
ధర్మానికి అసలు మూలం ఇస్లాం, నమాజు దాని మూల స్థంభం, దాని శిఖరం యొక్క ఎత్తు అల్లాహ్ మార్గంలో చేసే ధర్మపోరాటం.
కేవలం అల్లాహ్ యే అన్నీ ఎరుగను.
విషయసూచిక
[రెండవ ప్రాథమిక సూత్రము] 15
[మూడవ ప్రాథమిక సూత్రము] 25
***