فَضْلُ عَشْرِ ذِي الحِجَّةِ
దిల్ హిజ్జహ్ మాసంలోని మొదటి పది దినముల ఘనత
اللَّجْنَةُ العِلْمِيَّةُ
بِرِئَاسَةِ الشُّؤُونِ الدِّينِيَّةِ بِالمَسْجِدِ الحَرَامِ وَالمَسْجِدِ النَّبَوِيِّ
మస్జిద్ అల్ హరామ్ మరియు మస్జిద్ అన్నబవీలలోని ధార్మిక వ్యవహారాల విభాగానికి చెందిన శాస్త్రీయ కమిటీ
بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ
దిల్ హిజ్జహ్ మాసంలోని మొదటి పది
దినముల ఘనత
ముందుమాట
సకల స్తోత్రాలన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి. మరియు సర్వలోకాల కొరకు కారుణ్యంగా పంపబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై, అంతిమదినం వరకు ఆయన సున్నతులను మరియు ఆయన చూపిన సన్మార్గమును అనుసరించే వారిపై శుభాలు మరియు శాంతి కురియుగాక! అమ్మా బాద్:
ఇది సంక్షిప్తమైన సందేశం, దిల్ హిజ్జహ్ మాసంలోని మొదటి పది దినముల ఘనత గురించి ప్రతి ముస్లిం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలను ఇందులో పొందుపరిచాము. ఈ సందేశమును హరమైన్ షరీఫైన్ సందర్శకుల కోసం మరియు సందర్శకురాళ్ళ కోసం మేము సేకరించాము; తద్వారా వారు తమ ధార్మిక విషయాలలో సరైన అవగాహన కలిగి ఉంటారు మరియు (పొరపాట్లు, తప్పులు చేయకుండా) జాగ్రత్త పడతారు. అత్యంత దయామయుడు, కరుణాప్రధాత అయిన అల్లాహ్ ఈ సందేశాన్ని ఉపయోగకరంగా చేయాలని, దీనిని సత్కార్యంగా మరియు కేవలం ఆయన కోసమే స్వచ్ఛంగా తయారు చేయబడినదిగా చేయాలని మేము ప్రార్థిస్తున్నాము; ఆయనే అత్యత్తమంగా అభ్యర్థించదగినవాడు, అత్యంత కరుణాప్రధాత.
వివిధ భాషలలో ఇస్లామీయ సాహిత్య సేవా సంఘం యొక్క శాస్త్రీయ కమిటీ
దిల్ హిజ్జహ్ మాసపు మొదటి పది దినముల ఘనతలు:
దిల్ హిజ్హహ్ మొదటి పది రోజులు మరియు వీటి ఘనత ఎంతో విస్తారమైనది, అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సున్నతులలో దీని ఘనతను వివరించారు. అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో ఈ దినములపై ప్రమాణం చేసినాడు:
﴿وَٱلۡفَجۡرِ 1 وَلَيَالٍ عَشۡر2﴾
{ప్రాంతః కాలం సాక్షిగా!
పది రాత్రుల సాక్షిగా! [అల్ ఫజ్ర్: 1-2] ఇవి దిల్ హిజ్జహ్ మాసపు మొదటి పది దినములు అని ఇబ్న్ అబ్బాస్, ఇబ్న్ జుబైర్, ముజాహిద్, ఇబ్న్ కతీర్, ఇబ్న్ ఖయ్యిమ్ మరియు మరికొందరు సలఫ్ మరియు ఖలఫ్ తెలిపారు.1.
ఇవి అల్లాహ్ మార్గములో చేసే జిహాద్ కంటే కూడా సత్కార్యాలు చేయుట కొరకు అత్యుత్తమమైన రోజులు; అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇలా ప్రవచించారు:
«مَا مِنْ أَيَّامٍ الْعَمَلُ الصَّالِحُ فِيهِنَّ أَحَبُّ إِلَى اللَّهِ مِنْ هَذِهِ الْأَيَّامِ الْعَشَرِ»، قَالُوا: يَا رَسُولَ اللَّهِ! وَلا الْجِهَادُ فِي سَبِيلِ اللَّهِ؟ فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «وَلا الْجِهَادُ فِي سَبِيلِ اللَّهِ، إِلَّا رَجُلٌ خَرَجَ بِنَفْسِهِ وَمَالِهِ فَلَمْ يَرْجِعْ مِنْ ذَلِكَ بِشَيْءٍ».
"ఈ దినములలో చేసే సత్కార్యాలు (అంటే దిల్ హిజ్జహ్ నెల మొదటి పది దినములలో చేసే సత్కార్యాలు) మిగతా దినములన్నింటిలో చేసే సత్కార్యాల కంటే కూడా అల్లాహ్’కు అత్యంత ప్రియమైనవి.” అపుడు వారు ఇలా ప్రశ్నించినారు: “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! అల్లాహ్ మార్గములో చేసే జిహాదు (ధర్మయుద్ధం) కంటే కూడా గొప్పవా?” దానికి ఆయన “అవును, అల్లాహ్ మార్గములో చేసే జిహాదు కూడా (ఈ పది దినములలో చేసే సత్కార్యాల కంటే) గొప్పది కాదు; అయితే తన ప్రాణాన్ని, తన సంపదను వెంట తీసుకుని జిహాదు కొరకు వెళ్ళి, ఆ రెండింటిలో ఏ ఒక్క దానితోనూ వెనుకకు తిరిగి రాని వాని జిహాదు తప్ప” అన్నారు.2
దిల్ హిజ్జహ్ మాసపు మొదటి పది దినములలో చేసే సత్కార్యాల ప్రాముఖ్యతలు:
1. హజ్ మరియు ఉమ్రా ఆచరణ, ఇవి ఈ పది దినములలో చేసే అత్యుత్తమమైన ఆచరణలలో ఒకటి; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«مَن حَجَّ هَذَا الْبَيْتِ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ رَجَعَ كَيَوْمِ وَلَدَتْهُ أُمُّهُ».
"ఎవరైతే ఈ గృహం యొక్క హజ్ చేస్తారో, అశ్లీల పనులకు మరియు పాపకార్యాలకు దూరంగా ఉంటూ (హజ్) పూర్తి చేస్తారో, అతను తన తల్లి ప్రసవించిన రోజు మాదిరిగా (అతి పవిత్రంగా) మరలుతాడు." ముస్లిం గ్రంథంలోని పదాలలో ఈ హదీథు ఇలా ఉన్నది.
«مَن أَتَى هَذَا الْبَيْتِ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ؛ رَجَعَ كَيَوْمٍ وَلَدَتْهُ أُمُّهُ».
"ఎవరైతే ఈ గృహాన్ని (కాబాను) సందర్శించి, అశ్లీల పనులకు మరియు పాపకార్యాలకు దూరంగా ఉంటూ తిరిగి వస్తారో, అతను తన తల్లి ప్రసవించిన రోజు మాదిరిగా (అతి పవిత్రంగా) మరలుతాడు."3. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం: (ఈ పవిత్ర కాబాగృహాన్ని సందర్శించేవారు) హజ్ మరియు ఉమ్రహ్ (పుణ్యాలు) రెండింటినీ పొందుతారు మరియు అల్లాహ్ కు స్తుతులు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
«الْعُمْرَةُ إِلَى الْعُمْرَةِ كَفَّارَةٌ لِمَا بَيْنَهُمَا، وَالْحَجُّ الْمَبْرُورُ لَيْسَ لَهُ جَزَاءٌ إِلَّا الْجَنَّةُ».
ఒక ఉమ్రహ్ తర్వాత మరొక ఉమ్రహ్ చేయటం అనేది వాటి మధ్య జరిగిన పాపాలన్నింటికీ పరిహారం అవుతుంది. మబ్రూర్ (ఆమోద ముద్రపడిన) హజ్ కు ప్రతిఫలం స్వర్గం తప్ప మరేమి కాదు.4
2. మొత్తం తొమ్మిది దినముల ఉపవాసాలు లేదా అందులో సాధ్యమైనన్ని ఎక్కువ దినాల ఉపవాసాలు; దైవప్రక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«مَا مِنْ أَيَّامٍ الْعَمَلُ الصَّالِحُ فِيهِنَّ أَحَبُّ إِلَى اللَّهِ مِنْ هَذِهِ الْأَيَّامِ الْعَشَرِ».
మిగతా రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ఈ రోజుల్లో (అంటే దిల్ హిజ్జహ్ యొక్క మొదటి పదిరోజుల్లో) చేసే సత్కార్యాలు అల్లాహ్ కు అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఉపవాసం అత్యంత గొప్ప సత్కార్యాలలో ఒకటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని ఎంతో ప్రోత్సహించారు మరియు ప్రేరేపించారు, అందులో భాగంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«مَا مِنْ عَبْدٍ يَصُومُ يَوْمًا فِي سَبِيلِ اللَّهِ إِلَّا بَاعَدَ اللَّهُ بِذَلِكَ الْيَوْمِ وَجْهَهُ عَنِ النَّارِ سَبْعِينَ خَرِيفًا».
"ఏ దాసుడైతే అల్లాహ్ మార్గంలో ఒక దినము ఉపవాసం ఉంటాడో, అల్లాహ్ ఆ ఒక్క దినపు ఉపవాసానికి బదులుగా అతని ముఖాన్ని నరకాగ్ని నుండి డెబ్బై శరదృతువులంత (సంవత్సరాలంత) దూరానికి నెట్టివేస్తాడు."5.
3. నహర్ దినం మరియు తష్రీక్ దినములలో జంతువును బలి ఇచ్చుట (అల్ ఉధ్’హియహ్, ఖుర్బానీ చేయుట) షరియత్ అనుమతించినది, మరియు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాన్ని ఇలా ధృవీకరించినారు.
«ضَحَّى بِكَبْشَيْنِ أَمْلَحَيْنِ، أَقْرَنَيْنِ، ذَبَحَهُمَا بِيَدِهِ، وَسَمَّى وَكَبَّرَ وَوَضَعَ رِجْلَهُ عَلَى صِفَاحِهِمَا».
రెండు నల్లటి మచ్చలు గల తెల్లగా ఉన్న కొమ్ములు కలిగిన గొర్రెపోతులను తన చేతితో జిబహ్ చేశారు, జిబహ్ చేసేటప్పుడు బిస్మిల్లాహ్ అల్లాహు అక్బర్ అని తన కాలు దానిప్రక్కపై పెట్టారు.6
ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
«مَا عَمِلَ ابْنُ آدَمَ مِنْ عَمَلٍ يَوْمَ النَّحْرِ أَحَبُّ إِلَى اللَّهِ مِنْ إِهْرَاقِ الدَّمِ، وَإِنَّهُ لَيُؤْتَى يَوْمَ الْقِيَامَةِ بِقُرُونِهَا وَأَشْعَارِهَا وَأَظْلافِهَا، وَإِنَّ الدَّمَ لَيَقَعُ مِنَ اللَّهِ بِمَكَانٍ قَبْلَ أَنْ يَقَعَ فِي الْأَرْضِ، فَطَيِّبُوا بِهَا نَفْسًا».
నహర్ దినాన ఆదమ్ సంతతి చేసే పనులలో అల్లాహ్ కు అత్యంత ప్రీతికరమైనది ఖుర్బానీ రక్తస్రావం. ప్రళయ దినాన ఆ జంతువుల కొమ్ములు, రోమాలు, గోర్లు తీసుకురాబడతాయి. రక్తం భూమిపై పడకముందే అది అల్లాహ్ వద్ద ప్రీతిపాత్రమైన స్థలంలో పడుతుంది. కాబట్టి మీరు ఆ పనిని సంతోషంగా చేయండి.7.
దుల్ హిజ్జహ్ పది రోజులు ప్రారంభమైనప్పుడు, ఎవరు ఖుర్బానీ చేయదలచుకున్నారో వారు తమ జుట్టును మరియు చర్మాన్ని తీసే పనులను ఆపివేయాలి. ఎందుకంటే ఉమ్ము సలమా రజియల్లాహు అన్హా ద్వారా ప్రసిద్ధమైన హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
«إِذَا رَأَيْتُمْ هِلَالَ ذِي الْحِجَّةِ وَأَرَادَ أَحَدُكُمْ أَنْ يُضَحِّيَ؛ فَلْيُمْسِكْ عَنْ شَعْرِهِ وَأَظْفَارِهِ».
జిల్ హిజ్జహ్ నెలవంకను చూసిన తరువాత మీలో ఎవరు ఖుర్బానీ చేయాలని సంకల్పించుకున్నారో, అతను తన వెంట్రుకలు మరియు గోర్లు కత్తిరించకూడదు. వేరే పదాలలో ఇలా ఉన్నది:
«... فَلَا يَأْخُذَنَّ مِنْ شَعْرِهِ وَلَا مِنْ أَظْفَارِهِ شَيْئًا حَتَّى يُضَحِّيَ».
జంతువును ఖుర్బానీ చేసేంత వరకు తన వెంట్రుకలు మరియు గోర్లు కత్తిరించకూడదు.8
4. ఈ పది రోజులలో మరియు తష్రీక్ రోజులలో తక్బీర్, తహ్లీల్ మరియు అజ్'కార్ ఎక్కువగా చేయవలెను; అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీథు ప్రకారం:
«مَا مِنْ أَيَّامٍ أَعْظَمَ عِندَ اللَّهِ وَلَا أَحَبُّ إِلَيْهِ مِنَ الْعَمَلِ فِيهِنَّ مِنْ هَذِهِ الْأَيَّامِ الْعَشَرِ، فَأَكْثِرُوا فِيهِنَّ: مِنَ التَّهْلِيلِ، وَالتَّكْبِيرِ، وَالتَّحْمِيدِ».
ఈ పది దినములలో చేసే సత్కార్యాలు అల్లాహ్ కు అత్యంత ప్రీతికరమైనవి మరియు గొప్పవైనవి. కనుక ఈ రోజుల్లో ఎక్కువగా తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్), తక్బీర్ (అల్లాహు అక్బర్), తహ్మీద్ (అల్ హమ్'దులిల్లాహ్) చేయండి.9.
తక్బీర్ ఈ కింది విధంగా రెండు విధాలుగా విభజించబడింది:
మొదటి రకం: తక్బీర్ ముత్లక్, ఇది నమాజుల తర్వాత మాత్రమే కాకుండా, ప్రతి సమయంలో చేయవలసినది.
ఈదుల్ అద్హా లో తక్బీర్ ముత్లక్ దిల్-హిజ్జహ్ మొదటి పది రోజుల నుండి తష్రీక్ చివరి రోజు వరకు చేయవలసి ఉంటుంది: రాత్రింబవళ్ళు, ప్రయాణం, మార్కెట్లు, మస్జిద్‌లు, ఇళ్ళు మరియు అల్లాహ్ తాలాను జ్ఞాపకం చేయగలిగే ప్రతి చోట అన్ని సమయాలలో.
రెండవ రకం: తక్బీర్ ముఖయ్యద్: ఇది ప్రత్యేకంగా ఈదుల్ అద్హా సమయంలో నమాజుల తర్వాత చేయబడుతుంది. దీని సమయం మరియు విధానం క్రింది విధంగా ఉంటుంది:
మొదట: హజ్ చేయని వారి కొరకు తక్బీర్ ముఖయ్యద్ అరఫా రోజు ఫజ్ర్ నమాజు తరువాత ప్రారంభమవుతుంది, మరియు తష్రీఖ్ రోజులలో మూడవ రోజు అస్ర్ నమాజు తరువాత ముగుస్తుంది. హజ్ యాత్రికుడి కొరకు తక్బీర్ ముఖయ్యద్ హజ్ లో నహ్ర్ రోజు జుహ్ర్ నమాజు నుండి ప్రారంభమవుతుంది.
రెండవది: తక్బీర్ యొక్క విధానం: (అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్)10.
5. హజ్ చేయని వారు ఈదు నమాజు చేయడంలో ఆసక్తి చూపడం, దాని కొరకు ముందస్తుగా ఈద్గా వెళ్లడం, ఖుత్బా వినడం; ఎందుకంటే అవి ఇస్లాం యొక్క గొప్ప శిఖరాలు; దాని గొప్పతనం కారణంగా, స్త్రీలు, కన్యలైనా మరియు బహిష్టు స్థితిలో ఉన్నవారైనా కూడా ఈద్ నమాజుకు వెళ్లమని ఆదేశించబడ్డారు; ఉమ్ము అతియ్య రదియల్లాహు అన్హా ఉల్లేఖిస్తూ తెలిపారు:
«كُنَّا نُؤْمَرُ أَنْ نَخْرُجَ يَوْمَ الْعِيدِ حَتَّى نُخْرِجَ الْبِكْرَ مِنْ خِدْرِهَا، حَتَّى نُخْرِجَ الْحُيَّضَ فَيَكُنَّ خَلْفَ النَّاسِ، فَيُكَبِّرْنَ بِتَكْبِيرِهِمْ، وَيَدْعُونَ بِدُعَائِهِمْ، وَيَرْجُونَ بَرَكَةَ ذَلِكَ الْيَوْمِ وَطَهَارَتِهِ».
మేము ఈద్ రోజున బయల్దేరాలని ఆజ్ఞాపించబడేవాళ్ళం, ఇంత వరకు ఇంట్లోనే ఉంటున్న కన్యలను కూడా తీసుకుని బయల్దేరేవాళ్ళం, బహిష్టు స్థితిలో ఉన్నవారు కూడా వెనుక ఉండేవారు, వారు తక్బీర్ చేసే సమయంలో తక్బీర్ చేసేవారు, వారు దుఆ చేసే సమయంలో దుఆ చేసేవారు, ఆ రోజు యొక్క శుభం మరియు శుద్ధతను ఆశించేవారు. వేరే పదాలలో ఇలా ఉన్నది:
«وَأَمَرَ الْحُيَّضَ أَنْ يَعْتَزِلْنَ مُصَلَّىٰ الْمُسْلِمِينَ».
బహిష్టుస్థితిలో ఉన్నవారిని ముస్లింల పంక్తుల నుండి వేరుగా ఉండమని ఆదేశించారు.11
6. సత్కార్యాలు అధికంగా చేయడం, అదనపు ఆరాధనలలో: నమాజులు, సదఖా, ఖుర్ఆన్ పఠనం, మంచి పనులు చేయమని ఆదేశించడం మరియు చెడు పనుల నుండి నిరోధించడం, ఇరుగుపొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండటం, బంధువులతో సంబంధాలను కొనసాగించడం మరియు ఇతర సత్కార్యాలు చేయడం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాధారణ ఆదేశం ప్రకారం:
«مَا مِنْ أَيَّامٍ الْعَمَلُ الصَّالِحُ فِيهِنَّ أَحَبُّ إِلَى اللَّهِ مِنْ هَذِهِ الْأَيَّامِ الْعَشَرِ»، قَالُوا: يَا رَسُولَ اللَّهِ! وَلا الْجِهَادُ فِي سَبِيلِ اللَّهِ؟ فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : «وَلا الْجِهَادُ فِي سَبِيلِ اللَّهِ، إِلَّا رَجُلٌ خَرَجَ بِنَفْسِهِ وَمَالِهِ فَلَمْ يَرْجِعْ مِنْ ذَلِكَ بِشَيْءٍ».
ఈ దినములలో చేసే సత్కార్యాలు (అంటే జిల్ హిజ్జహ్ నెల మొదటి పది దినములలో చేసే సత్కార్యాలు) మిగతా దినములలో చేసే సత్కార్యాల కన్నా కూడా అల్లాహ్’కు అత్యంత ప్రియమైనవి.” (వింటున్న) వారు ఇలా ప్రశ్నించినారు: “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! అల్లాహ్ మార్గములో చేసే జిహాదు కంటే కూడా గొప్పవా?” దానికి ఆయన “అవును, అల్లాహ్ మార్గములో చేసే జిహాదు కూడా (ఈ పది దినములలో చేసే సత్కార్యాల కన్నా) గొప్పది కాదు; అయితే తన ప్రాణాన్ని, తన సంపదను వెంట తీసుకుని జిహాదు కొరకు వెళ్ళి, ఆ రెండింటిలో ఏ ఒక్క దానితోనూ వెనుకకు తిరిగి రాని వాని జిహాదు తప్ప” అన్నారు.12.
మరియు అల్లాహ్ తో ప్రార్థన ఏమనగా ఆయన మాకు నేర్పిన దానితో మాకు లాభం కలిగించుగాక మరియు మాకు లాభదాయకమైన దాన్ని నేర్పుగాక. నిశ్చయంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలి, గౌరవప్రదుడు. మరియు అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై శుభాలను, శాంతిని విస్తృతంగా కురిపించుగాక.
విషయసూచిక
ముందుమాట 2
దిల్ హిజ్జహ్ మాసపు మొదటి పది దినముల ఘనతలు: 3
దిల్ హిజ్జహ్ మాసపు మొదటి పది దినములలో చేసే సత్కార్యాల ప్రాముఖ్యతలు: 5
***
te431v1.0 - 24/05/2026
దీనిని బుఖారీ మరియు తిర్మిథీ ఉల్లేఖించారు మరియు పదాలు తిర్మిథీవి.
దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని తిర్మిథీ ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖఇంచారు.
దీనిని అహ్మద్ ఉల్లేఖించారు.
చూడండి: ఇబ్నె ఖుదామ యొక్క అల్ ముఘ్నీ (3/290), మరియు అల్ షరహ్ అల్ కబీర్ మఅల్ ముక్నిఅ్ వల్ ఇన్సాఫ్ (5/380).
దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
దీన్ని బుఖారీ, తిర్మిథి ఉల్లేఖించారు. మరియు పదాలు తిర్మిథివి.
తఫ్సీర్ ఇబ్నె కసీర్ (4/106), మరియు జాదుల్ మఆద్ (1/56).